
ఖమ్మం, 01 అక్టోబర్ (హి.స.)
విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి రూ.205 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
బుధవారం వారు ఖమ్మంలో టీజీఎన్పీడీసీఎల్ డివిజన్ కార్యాలయం, విద్యుత్తు రెవెన్యూ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గంలో, ప్రత్యేకంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా కొరకు 33కేవీ ఇంటర్ లింకింగ్ లైన్ ఫీడర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గత రెండేళ్లలో 632 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయించామని, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో నాలుగు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.
పాలేరు నియోజకవర్గంలో గత రెండేళ్లలో గృహ జ్యోతి లబ్ధిదారులకు రూ.40.19 కోట్ల సబ్సిడీ వర్తించినట్లు తెలిపారు. మోడల్ సోలార్ గ్రామం పథకంలో భాగంగా.. నేలకొండపల్లిలోని చెరువు మాదారంలో 1,350 మంది గృహ వినియోగదారులకు రూ. 15.66 కోట్ల వ్యయంతో 2,709 కే డబ్ల్యూ సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకల పనులు పురోగతిలో ఉన్నాయని, అలాగే రైతుల కోసం రూ. 31.08 కోట్లతో సౌర విద్యుత్ సౌకర్య పనులు చేపట్టినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..