
న్యూఢిల్లీ, 01 అక్టోబర్ (హి.స.)
సివిల్ సర్వీస్ ఎంపిక ప్రక్రియను ఆధునీకరించాలని, ఉద్యోగుల సెల్ఫ్ అప్రైజల్ పద్ధతిని ప్రోత్సహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గురువారం ఢిల్లీలో యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడిన ప్రధాని మోదీ.. సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం కావాలన్నారు. పేదల ఆవేదన అర్థం చేసుకునే మనసు ఉద్యోగులకు ఉండాలని పేదల సమస్యల సత్వర పరిష్కారానికి సాంకేతికతను వాడాలన్నారు.
దేశం సంస్కరణ రథంపై పరుగు పెడుతోందన్నారు.
దేశం క్రమంగా పట్టణీకరణ వైపు ప్రయాణిస్తోందని ఈ విషయంలో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ప్రధాని అన్నారు. ప్రభుత్వ సేవల్లో ఏఐని సమర్థంగా వాడుకోవాలని సూచించారు.
లక్షల కొద్ది పేజీల డేటాను ఏఐ కొద్ది సేపట్లోనే ప్రాసెస్ చేస్తోందన్నారు.
ఈ రోజు యూపీఎస్సీ (UPSC) 100 సంవత్సరాల ప్రయాణాన్ని జరుపుకోవడమే కాకుండా, ఒక గొప్ప వారసత్వాన్ని కూడా జరుపుకుంటున్నామన్నారు. ఇది ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత కలలు కనే ఆకాంక్షల ఉత్సవం. ఈ సంస్థపై ప్రతి భారతీయుడు ఉంచిన నమ్మకానికి ఇది ప్రతీక.
ఈ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, సాంకేతికత రూపాంతరం చెందింది మరియు సిలబస్ కూడా మారింది... అయినప్పటికీ, యూపీఎస్సీపై ఉన్న నమ్మకం మాత్రం ఎప్పటిలాగే ఏమాత్రం చెక్కుచెదరకుండా నిలిచిందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు