
అమరావతి, 01 అక్టోబర్ (హి.స.)రాచవారిపాలెం సమీపంలో గొర్రెలు కాస్తున్న రామయ్య అనే బాలుడిని చూసి తన హృదయం ద్రవించిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు.
బడిలో ఉండి చదువుకోవాల్సిన వయసులో ఒక బాలుడు గొర్రెల కాపరిగా పనిచేస్తున్న పరిస్థితి బాధాకరంగా ఉందని పేర్కొన్నారు.
ఎనిమిదేళ్ల వయసులో గొర్రెలు మేపుతూ కనిపించిన రామయ్య అనే బాలుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తల్లిదండ్రులు జీతానికి తనను అప్పగించారని, యజమాని సరిగ్గా అన్నం పెట్టడంలేదని బాలుడు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
తాజాగా ఈ వీడియోపై మంత్రి నారాలోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎనిమిదేళ్ల బాలుడు ఆహారం, సంరక్షణ లేకుండా మేకలను మేపుతున్న వీడియో తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పరిస్థితులు పరిశీలించాలని ఆదేశించారు. దయచేసి వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని లోకేష్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV