ఢిల్లీలో సీజేపీ (CJP) నిరసన ప్రదర్శన – యూట్యూబర్ ధ్రువ్ రాఠీ అరెస్ట్
ఢిల్లీలో సీజేపీ (CJP) నిరసన ప్రదర్శన – యూట్యూబర్ ధ్రువ్ రాఠీ అరెస్ట్
arrest


హైదరాబాద్, 10 అక్టోబర్ (హి.స.)

​ఢిల్లీలోని జంతర్-మంతర్ వేదికగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ఆందోళనకు పోలీసులు ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదు. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

​ముందస్తు చర్యల్లో భాగంగా, ఈ ఆందోళనకు మద్దతుగా ప్రచారం చేసిన ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో ఢిల్లీ మరియు గురుగ్రామ్ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లి నిరసనలో పాల్గొనవద్దని పోలీసులు చేసిన హెచ్చరికలను ఆయన పాటించకపోవడంతో, చట్టపరమైన చర్యల కింద ఆయనను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

​ఢిల్లీ వ్యాప్తంగా ముందస్తు నిరోధక చర్యలు తీవ్రతరం చేయడంతో పాటు, CJP వ్యవస్థాపకులు అభిజిత్ దిప్కే తదితర కీలక నాయకులను కూడా ఢిల్లీ విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్-మంతర్ పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారీగా భద్రతా బలగాలను మోహరించడంతో పాటు, పలు మెట్రో స్టేషన్లలో ప్రవేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఆందోళనకు యత్నించిన సుమారు 150 మందికి పైగా కార్యకర్తలు, నిరసనకారులను పోలీసులు వివిధ ప్రాంతాలలో అదుపులోకి తీసుకున్నారు. నగర సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేసి, ఎవరినీ జంతర్-మంతర్ వైపు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సోషల్ మీడియా వేదికగా CJP తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande