
ముంబై, 10 అక్టోబర్ (హి.స.)
మహాత్మా గాంధీ ప్రపౌత్రుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త తుషార్ గాంధీని ముంబై పోలీసులు శనివారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని చారిత్రక ఆగస్టు క్రాంతి మైదాన్ వద్ద నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శనకు వెళ్తున్న సమయంలో పోలీసులు ఆయనను మార్గమధ్యంలో నిలిపివేసి డి.ఎన్. నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల నిర్వహణ విధానాలు, ఓటర్ల జాబితా అంశాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా నిరసన ర్యాలీలు, సభలు నిర్వహించడం చట్టవిరుద్ధమని, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యానే ఈ చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. బొంబాయి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు క్రాంతి మైదాన్ నిరసనలకు నిర్దేశించిన ప్రాంతం కాదని అధికారులు స్పష్టం చేశారు. తుషార్ గాంధీతో పాటు ‘హమ్ భారత్ కే లోగ్’ సంస్థకు చెందిన మరికొందరు నాయకులను కూడా వేర్వేరు ప్రాంతాలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టే ఆందోళనలు ఆగేది లేదని తుషార్ గాంధీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. నిరసనకారులను పోలీసు స్టేషన్‌కు తరలించినప్పటికీ, రాజ్యాంగ బద్ధంగా తమ నిరసన తెలిపే హక్కు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ముందస్తు అరెస్టుల ఘటన ముంబైతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi