
అమరావతి , 11 అక్టోబర్ (హి.స.)ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికకు ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం ప్రకారం గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు సగటున 28.18 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే అన్ని స్థానిక సంస్థల్లో ఒకే శాతం రిజర్వేషన్ వర్తించదు. ఆయా ప్రాంతాల్లోని జనాభా, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, వర్తించే చట్టపరమైన పరిమితులను పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లు నిర్ణయించనున్నారు.
బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచాలనే ప్రభుత్వ ప్రయత్నానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. చట్టపరమైన మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ఈ నివేదిక అమలులోకి వస్తే గ్రామపంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే విధానంపై ప్రభావం పడుతుంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించి, తదుపరి ఎన్నికల ప్రక్రియకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్