మితిమీరిన వేగం.....ఇద్దరు బలి
గ్రామీణ భీమిలి, మితిమీరిన వేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలి కొన్నది. భీమిలి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Accident


అమరావతి, 12 అక్టోబర్ (హి.స.)

గ్రామీణ భీమిలి, మితిమీరిన వేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలి కొన్నది. భీమిలి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ నియోజకవర్గం పరిధి అల్లిపురం లక్ష్మీదేవిపేటకి చెందిన వాడమొదులు అఖిల్ (19), జెండా చెట్టు ప్రాంతంలో ఉంటున్న పిల్లా ధనుంజయ్ (20) స్నేహితులు.

అఖిల్ డాక్యార్డ్లో ప్రైవేటుగా వెల్డింగ్ పనులు చేస్తున్నారు. ధనుంజయ్ వన్టౌన్ ప్రాంతంలోని ఓ ఇన్స్టిట్యూట్లో వెల్డింగ్ కోర్సులో శిక్షణ పొందుతున్నారు. ఇరువురు విదేశాలకు వెళ్లి స్థిర పడాలనుకున్నారు. వీకెండ్ కావడంతో ఆదివారం ఉదయం ఏడు గంటలకు బీచ్ రోడ్డులోని మంగమారిపేట గోకార్టింగ్ సమీపంలో క్రికెట్ ఆడేందుకు స్నేహితులతో కలిసి వచ్చారు. కొంత సేపటికి ఇరువురు వాటర్బాటిల్ కోసం ద్విచక్రవాహనంపై చేపలుప్పాడ, కె.నగరపాలెం వైపు వెళ్లారు. మితిమీరిన వేగంతో తిరిగి మైదానానికి వస్తుండగా వాహనం అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో అఖిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కొన ఊపిరితో ఉన్న ధనుంజయ్ని 108 అంబులెన్స్లో కేజీహెచ్కి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అఖిల్ తండ్రి మురళీ ఆటో డ్రైవరు, తల్లి కుమారి గృహిణి, ధనుంజయ్ తండ్రి ఎల్లాజీ కార్పెంటర్, తల్లి గుణ గృహిణి. చేతికందిన పిల్లలు మృతి చెందడంతో వీరు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సీఐ దివాకర్ యాదవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande