
విజయవాడ, 12 అక్టోబర్ (హి.స.)
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ఆమె దర్శించుకోనున్నారు. అలాగే, పున్నమి ఘాట్లో నిర్వహించే సరస్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టడంతో పాటు పటిష్ట భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.
రాష్ట్రపతి షెడ్యూల్ ఇదే..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 14న సాయంత్రం 6:25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఆమె విజయవాడలోని ఇంద్రకీలాద్రికి వెళ్లి రాత్రి 7:20 గంటలకు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రోటోకాల్ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు
సరస్ మేళలో పాల్గొననున్న రాష్ట్రపతి
అక్టోబర్ 15న విజయవాడలోని పున్నమి ఘాట్లో నిర్వహించే సరస్ మేళాలో రాష్ట్రపతి పాల్గొంటారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, లఖ్పతి దీదీలతో నిర్వహించే విందు కార్యక్రమానికి హాజరవుతారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి, గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలపై చర్చించేందుకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. రెండు రోజుల విజయవాడ పర్యటనను ముగించుకున్న అనంతరం ద్రౌపది ముర్ము అక్టోబర్ 15న మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ