
న్యూఢిల్లీ, 12 అక్టోబర్ (హి.స.)
భారతదేశంలో ప్రభుత్వ వ్యవస్థలను అస్థిరపరచడానికి, దేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి కొన్ని బాహ్య శక్తులు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాది, దేశ మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్‌లలో చోటుచేసుకున్న అల్లర్లు, రాజకీయ అస్థిరత తరహా పరిస్థితులను ఇక్కడా సృష్టించేందుకు కొన్ని విదేశీ శక్తులు నిధులు సమకూరుస్తూ కుట్ర పన్నుతున్నాయని ఆయన గట్టిగా ఆరోపించారు.
ఇటీవల మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన హరీశ్ సాల్వే, దేశంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న కొన్ని నిరసనలు, ఆందోళనల వెనుక స్పష్టమైన ప్రణాళిక, విదేశీ హస్తం ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా వంటి కొన్ని పాశ్చాత్య దేశాలు భారత్ ఎదుగుతున్న తీరును చూసి జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే అంతర్గతంగా అశాంతిని రాజేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వేదికగా రీల్స్, యూట్యూబ్ వీడియోలు మరియు ప్రత్యేక సందేశాల ద్వారా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ తరహా ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న యూట్యూబర్లు, విదేశాల్లో (ముఖ్యంగా జర్మనీ లాంటి దేశాల్లో) నివసిస్తున్న కొందరు వ్యక్తులు ఈ కార్యకలాపాల కోసం భారీగా నిధులు ఎక్కడి నుంచి పొందుతున్నారని సాల్వే ప్రశ్నించారు. నిరసనలు లేదా ధర్నాలు నిర్వహించడానికి ఆర్థిక వనరులు అవసరమని, దీని వెనుక పక్కా పన్నాగం ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇది ప్రజల నుంచి వచ్చిన స్వచ్ఛమైన ప్రజా ఉద్యమం కాదని, రాజకీయ లబ్ధి కోసం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి చేస్తున్న ప్రయత్నమేనని ఆయన తేల్చిచెప్పారు.
వ్యవస్థలను అస్థిరపరచాలని చూసే ఇటువంటి కదలికలను ప్రభుత్వం అత్యంత దృఢంగా, కఠినంగా అణచివేయాలని హరీశ్ సాల్వే పిలుపునిచ్చారు. విదేశీ నిధుల ప్రవాహంపై సమగ్ర దర్యాప్తు జరిపించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును ఎవరయినా చట్టప్రకారమే వినియోగించుకోవాలి తప్ప, నిరసనల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi