
అమరావతి , 12 అక్టోబర్ (హి.స.)
దసరా సెలవుల నేపథ్యంలో సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా పోలీసులు ప్రజలకు సూచించారు. నకిలీ ట్రాఫిక్ ఈ-చలాన్ సందేశాలు, పండుగ ప్రత్యేక ఆఫర్ల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకుల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశముందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించిరు.
ప్రస్తుతం మొబైల్ ఫోన్ల వినియోగం పెరగడంతో బ్యాంకింగ్, చెల్లింపులు, ప్రభుత్వ సేవలు, ఆన్లైన్ కొనుగోళ్లు వంటి అనేక పనులు డిజిటల్ పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఈ సౌకర్యాలను వినియోగించుకుంటూనే మోసగాళ్లు కూడా కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా పండుగల సమయంలో రాయితీలు, బహుమతులు, అత్యవసర చెల్లింపులు, జరిమానాల పేరుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు జరగవచ్చు.
నకిలీ ఈ-చలాన్ మోసాల్లో వాహనదారులకు ట్రాఫిక్ జరిమానా పెండింగ్లో ఉందని సందేశం పంపి, దానిని చెల్లించడానికి ఒక లింకుపై క్లిక్ చేయాలని సూచించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏపీకే (APK) ఫైల్ను డౌన్లోడ్ చేయాలని కోరవచ్చు. అలాంటి ఫైళ్లను ఇన్స్టాల్ చేయడం వల్ల మొబైల్లోని సమాచారం, బ్యాంకింగ్ వివరాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.
కర్నూలు జిల్లా ఎస్పీ హెచ్చరిక ప్రకారం, ఈ-చలాన్ల పేరుతో పోలీసు శాఖ ఏపీకే ఫైళ్లను పంపదని స్పష్టం చేశారు. అందువల్ల గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చిన సందేశాలను నమ్మి యాప్లు ఇన్స్టాల్ చేయకూడదు. ట్రాఫిక్ జరిమానా ఉందో లేదో తెలుసుకోవాలంటే అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ లేదా సంబంధిత అధికారిక సేవలను మాత్రమే వినియోగించాలి అని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్