144 ఏళ్ల తర్వాత బర్దా అభయారణ్యానికి ఆసియా సింహాల పునరాగమనం
144 ఏళ్ల తర్వాత బర్దా అభయారణ్యానికి ఆసియా సింహాల పునరాగమనం
lion


అహ్మదాబాద్, 12 అక్టోబర్ (హి.స.)

గుజరాత్‌లో వన్యప్రాణి సంరక్షణ రంగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 144 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసియా సింహాలు బందర్ మరియు దేవభూమి ద్వారక జిల్లాల మధ్య విస్తరించి ఉన్న బర్దా వన్యప్రాణి అభయారణ్యానికి తిరిగొచ్చాయి. శతాబ్దానికి పైగా కేవలం గిర్ అడవులకే పరిమితమైన ఈ వనరాజుల గర్జన ఇప్పుడు బర్దా అడవుల్లో మళ్లీ ప్రతిధ్వనిస్తోంది.

అభయారణ్యం పునర్వ్యవస్థీకరణ: బర్దా అభయారణ్యాన్ని ఆసియా సింహాలకు రెండవ సురక్షిత నివాస ప్రాంతంగా (సెకండ్ హోమ్) తీర్చిదిద్దడానికి గుజరాత్ ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతంలో అడవుల నిర్వహణను మెరుగుపరచడానికి వీలుగా పోర్‌బందర్ అటవీ డివిజన్‌ను పునర్వ్యవస్థీకరించి ప్రత్యేక అధికారులను, నిఘా బృందాలను రంగంలోకి దించింది.

శాస్త్రవేత్తలు, అటవీశాఖ అధికారులు జీపీఎస్ రేడియో కాలర్ సాంకేతికత ద్వారా సింహాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వేల సంఖ్యలో నమోదైన లోకేషన్ డేటా ఆధారంగా బర్దాలోని గడ్డిభూములు, నీటి వనరులు సింహాల మనుగడకు, కొత్త ఆవాసాలు ఏర్పరచుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉన్నాయని అధ్యయనాలు స్పష్టం చేశాయి.

సింహాలు స్థిరంగా నివసించేందుకు వీలుగా బర్దా ప్రాంతంలో సహజ సిద్ధమైన ఎర (జంతువులు), నీటి లభ్యత పెంచేందుకు అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మానవ-వన్యప్రాణి సంఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు గ్రామ సరిహద్దుల్లో ప్రత్యేక ట్రాకర్లను, త్వరిత స్పందన బృందాలను (క్విక్ రెస్పాన్స్ టీమ్స్) ఏర్పాటు చేశారు.

ఒకే ప్రాంతంపై ఆధారపడే ప్రమాదాన్ని తగ్గించేందుకు, మహమ్మారులు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జాతి మనుగడను కాపాడేందుకు గిర్ దాటి ప్రత్యామ్నాయ నివాస ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అత్యంత ప్రాముఖ్యమైన అడుగుగా పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు. బర్దాలో సింహాలు విజయవంతంగా అడుగుపెట్టడం భారతీయ వన్యప్రాణి సంరక్షణ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande