
హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.)
నేడు (సోమవారం )రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సూపర్ ఎల్నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని, అనేక ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులతో మాట్లాడి యాసంగి 2026–27 పంటల సాగు ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు.
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోవడం, సాగునీటి లభ్యత పరిమితంగా ఉండటంతో రైతులు యాసంగి 2026–27 పంటల సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
నీటి లభ్యత లేని ప్రాంతాల్లో సాగుకు దూరంగా ఉండాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని కోరారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తూ, రానున్న జూన్ వరకు తాగునీటి అవసరాలను తీర్చేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తాగునీటి పథకాల్లో సమస్యలు తలెత్తితే వెంటనే మరమ్మతులు చేపట్టి, అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..