
మెదక్, 12 అక్టోబర్ (హి.స.)
పొలాలకు సకాలంలో విద్యుత్ అందక పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లాలోని రైతులు ఆందోళన బాట పట్టారు.
వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా శివంపేట మండలంలోని చండి విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..
వ్యవసాయానికి విద్యుత్ ఎంతో కీలకమని, ముఖ్యంగా వరి వంటి పంటలకు కీలక దశలో నీరు అందకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో బోర్ల ద్వారా పంటలకు నీరు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర వ్యవసాయ ఖర్చుల కోసం భారీగా పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు విద్యుత్ సమస్య కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని వాపోయారు. పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు చేతికొచ్చే కీలక సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో నిరంతరాయంగా, సరిపడా విద్యుత్ అందించాలని కోరారు. కరెంటు కోసం సబ్స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా అధికారులు సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..