
గాంగ్‌టక్:, 12 అక్టోబర్ (హి.స.)
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా సిక్కిం రాష్ట్ర మంత్రిమండలి ఆయనకు ఘనంగా అభినందనలు తెలిపింది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
ప్రధాని మోదీ దూరదృష్టి కలిగిన నాయకత్వాన్ని, దేశ సమగ్ర వికాసానికి ఆయన అందిస్తున్న నిరంతర సేవలను కేబినెట్ కొనియాడింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా పాలనా సంస్కరణలు చేపట్టి, ఆ తర్వాత భారత ప్రధానిగా దేశాన్ని ప్రపంచ వేదికపై అగ్రగామిగా నిలబెట్టడంలో ఆయన పాత్ర అద్భుతమైనదని వ్యాఖ్యానించింది. గత పాతికేళ్లలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ సమగ్ర అభివృద్ధికి, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల ప్రగతికి సరికొత్త ఊపిరి పోశాయని కేబినెట్ పేర్కొంది.
ఈశాన్య ప్రాంత అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారని, 'అష్టలక్ష్మి'గా వర్ణించే ఈశాన్య రాష్ట్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రవాణా, పర్యాటక రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందాయని సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు. సిక్కింను సేంద్రీయ (ఆర్గానిక్) రాష్ట్రంగా ప్రోత్సహించడంలోనూ, పర్యాటక రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలోనూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
మోదీ శ్రమకోర్చి చేసే నిరంతర ప్రజాసేవ, 'సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్' అనే దూరదృష్టి కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిదాయకమని మంత్రిమండలి కొనియాడింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో దేశానికి మరిన్ని సేవలు అందించాలని సిక్కిం ప్రభుత్వం మరియు ఆ రాష్ట్ర ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi