
న్యూఢిల్లీ, అక్టోబర్ 13 (హి.స)
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నిరంకుశ పోకడలపై 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న యువతను, ఆందోళనకారులను భయభ్రాంతులకు గురిచేసేందుకు మరియు వారి మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ప్రజా సమస్యలపై గళం విప్పాలని భావిస్తే ముందస్తు అరెస్టులు చేయడం, పోలీసు బలగాలతో అణచివేయాలని చూయడం కేంద్ర ప్రభుత్వ భయానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
సొంత దేశంలో రాజ్యాంగబద్ధంగా హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిని అణచివేయడమే లక్ష్యంగా పాలకులు వ్యవహరిస్తున్నారని దీప్కే విమర్శించారు. నిరసన గళాలను నొక్కేయాలని చూసినప్పటికీ యువత భయపడదని, ప్రజాస్వామ్య బద్ధంగా తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో నిరుద్యోగం, వ్యవస్థల వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాలు కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi