
న్యూఢిల్లీ, 13 అక్టోబర్ (హి.స.)
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) పై సోషల్ మీడియా వేదికగా జరిగిన అత్యంత వివాదాస్పద పోస్ట్‌ను సర్వోన్నత ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. సీజేఐను లక్ష్యంగా చేసుకుని, న్యాయ వ్యవస్థ స్థైర్యాన్ని, ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్న ఈ పోస్ట్‌పై సుమోటోగా (స్వచ్ఛందంగా) విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో అధికారికంగా ఫిర్యాదు దాఖలైంది.
న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలలో ఉన్న నమ్మకాన్ని సడలించేలా, ఉన్నత న్యాయపీఠాన్ని తక్కువ చేసి చూపేలా వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన నేరమని న్యాయవాదుల సంఘాలు అభిప్రాయపడ్డాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాదని, అది మొత్తం న్యాయవ్యవస్థ స్వతంత్రతపై జరిగే దాడిగా భావించాల్సి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమాలలో వాక్ స్వతంత్య్రం పేరిట న్యాయమూర్తులను, కోర్టు తీర్పులను కించపరచే ధోరణి ఇటీవల పెరుగుతుండటంపై న్యాయ కోవిదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో భావ ప్రకటన స్వేచ్ఛకు హద్దులు ఉంటాయని, న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలను ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
ఈ ఫిర్యాదును స్వీకరించిన సుప్రీంకోర్టు, ఈ విషయాన్ని సుమోటో క్రిమినల్ కోర్టు ధిక్కార కేసుగా పరిగణించి విచారణకు స్వీకరించేందుకు చర్యలు చేపట్టింది. సంబంధిత పోస్ట్ చేసిన వ్యక్తులు, ఆ కంటెంట్‌ను వ్యాప్తి చేసిన సామాజిక మాధ్యమాలపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, డిజిటల్ వేదికలలో ఇటువంటి దుష్ప్రచారాలను అరికట్టేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi