
హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.) సింగరేణి కార్మికులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభ వార్త చెప్పారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు, కార్మికులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు.
మంగళవారం మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. సింగరేణిలో 38,738 మంది పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు 29,715 మంది పని చేస్తున్నారని తెలిపారు. వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏళ్ల వేళ్లలో సిద్ధం అని చెప్పారు. సింగరేణిలో కారుణ్య నియామకాలను 15 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మారుపేర్ల అంశానికి సంబంధించి 15 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.
మెడికల్ ఇన్వ్యాలిడేషన్ కోసం కార్మికులు కొత్తగూడెం వెళ్లాల్సి వస్తోందని.. ఇకపై సింగరేణిలో ఏరియా ఆస్పత్రుల్లోనే మెడికల్ ఇన్వ్యాలిడేషన్ పరీక్షలు చేసే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరలో ఈ సదుపాయం అమలు చేస్తాం అని ఆసరా కల్పించారు.
కరోనా సమయంలో విధులకు హాజరుకాకుండా డిస్మిస్ అయిన వారిని విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. వన్ టైమ్ ఆప్షన్ కింద వారికి అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. సింగరేణికి చెందిన 1250 ఎకరాల్లో జీవో 76 ప్రకారం అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తామన్నారు. ఇప్పటికే ఆక్రమణలో ఉన్న వారిలో అర్హులకు పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. హౌసింగ్ కాలనీ నిర్మించి కార్మికులకు అందిస్తామని.. కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని చెప్పారు. నెహ్రూ హౌసింగ్ కాలనీ పేరిట ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. గత ప్రభుత్వం తాలూకా పొరపాట్లను కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యబోదు అని విమర్శించారు.
ఏరియా హాస్పిటల్స్ను కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా అభివృద్ధి చేస్తామని భట్టి స్పష్టం చేశారు. సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి ప్రాంతాల్లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా అమలు పరుస్తాం అని ధైర్యం ఇచ్చారు.
సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం మానవీయ కోణంలో తాము నిర్ణయం తీసుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సింగరేణి కార్మికులను బీఆర్ఎస్ దోపిడీ చేసిందని ఆరోపించారు. సింగరేణి ఎన్నికలు వస్తేనే బీఆర్ఎస్కు కార్మికులు గుర్తుకువస్తారా అని ప్రశ్న సంధించారు. మారు పేర్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోలేదని నిలదీశారు. కాంట్రాక్టు కార్మికుల ప్రయోజనాల గురించి బీఆర్ఎస్ ఏనాడు ఆలోచించలేదని విమర్శించారు. 3389 పోస్ట్లు సింగరేణిలో భర్తీ చేశామని.. 4237 కారుణ్య నియామకాలు చేపట్టామని తెలిపారు. కోటి రూపాయల బీమా కల్పించి కార్మికులకు అండగా నిలబడ్డామని ఉద్ఘాటించారు. మరోసారి కార్మికులను మోసం చేసేందుకు బీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల సమస్యలను గులాబీ పార్టీ ఎందుకు పరిష్కరించలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసిన తప్పు మేం చెయ్యబోము అని ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్