ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, చట్టాలను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలి.. సీఎం రేవంత్ రెడ్డి
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, చట్టాలను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలి.. సీఎం రేవంత్ రెడ్డి
Cm


హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)

ఇవాళ హైటెక్స్లో ప్రారంభమైన 'సమాఖ్య-2026' సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన యువత, పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలు,దేశ అభివృద్ధిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కొత్త తరానికి కొత్త వాణిజ్య చట్టాలపై అవగాహన కల్పించడం ఎంతైనా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమాఖ్య చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, చట్టాలను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు ఎదగడంతో పాటు సమాజానికి ఆదర్శంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతరిక్షంలోకి రాకెట్ను పంపడంలో మన దేశ యువత ఎలాన్ మస్క్ తో పోటీ పడుతోందని సీఎం కొనియాడారు. దేశానికి 2047 చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతుంటారని, స్వాతంత్య్ర శత జయంతి ఉత్సవాల నాటికి భారత్ అగ్రస్థానంలో ఉండాలని మోడీ నిర్దేశించారని గుర్తుచేశారు.

జనాభా శాతాన్ని మించి తెలంగాణ రాష్ట్రం జీడీపీకి తన వంతు వాటా అందిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 400 ఏళ్లుగా హైదరాబాద్లో కాస్మోపాలిటిన్ వాతావరణం ఉందని, అన్ని రాష్ట్రాలు, దేశాల వారిని ఆదరించే సంస్కృతి ఇక్కడ ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాము టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో హైదరాబాద్ అభివృద్ధిలో వేగం పెరిగిందని, 'క్యూర్' పరిధిలో ఉన్న పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రధాని మోడీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 'పెరీ' పరిధిలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ, రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధిని పట్టాలెక్కించామని, పెట్టుబడుల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande