
పాలమూరు , 14 అక్టోబర్ (హి.స.)తెలంగాణ ప్రాణహిత ప్రాజెక్టులలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నేడు మరో కీలక అడుగు పడింది. నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని నార్లాపూర్ పంప్ హౌస్లో అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో రెండో పంపును మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టులో అత్యంత శక్తివంతమైన 'బాహుబలి' మోటార్ల ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటి ఎత్తిపోతల ప్రక్రియ ఇవాళ అధికారికంగా ఊపందుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు దక్షిణ తెలంగాణలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పనులను అత్యంత ప్రాధాన్యతతో ముందుకు తీసుకువెళ్తోంది. రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం, పంపుల పనితీరును ఇంజనీరింగ్ నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ నీటి ఎత్తిపోతల ద్వారా భవిష్యత్తులో వేసవి కాలం నాటికి కూడా తాగునీటి కొరత తలెత్తకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్