
సూర్యాపేట, 14 అక్టోబర్ (హి.స.)
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ-2005) అమలులో రాష్ట్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా సూర్యాపేట గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కె. నరసింహ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ చట్టం అమలులో సూర్యాపేట జిల్లా యంత్రాంగం కనబరిచిన పనితీరుకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ నాయకత్వంలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావడం ప్రశంసనీయమని తెలిపారు.ప్రభుత్వ శాఖల పనితీరులో పారదర్శకతను పెంపొందించడం, ప్రజలకు ప్రభుత్వ సమాచారం అందుబాటులో ఉండేలా చూడటం, ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపడం వంటి అంశాల్లో జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం సమర్థవంతంగా అమలవడం వల్ల ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు