
ఢిల్లీ, 14 అక్టోబర్ (హి.స.)రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న క్రమంలో సుప్రీం కోర్టు (Supreme Court)లో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది.ఎపీలో కొన్ని గ్రామాలను ఏకపక్షంగా మున్సిపాలిటీల్లో విలీనం చేశారంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
వివిధ మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ పిటిషన్లను జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం విచారించింది.ఏపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను వినిపించారు. ఎద్దుల సుబ్బారెడ్డి, వల్లేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం ఈ పిటిషన్లు దాఖలు చేయగా.. వీరి తరఫున సీనియర్ న్యాయవాది రామకృష్ణ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై స్టే ఇచ్చేందుకు, మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. సంబంధిత గ్రామ పంచాయతీల తీర్మానాలు, ప్రజల ఆమోదం లేకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా గ్రామాల విలీన ప్రక్రియను చేపట్టిందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పంచాయతీ రాజ్ చట్టం, రాజ్యాంగ నిబంధనల ప్రకారం పాటించాల్సిన కనీస చట్టపరమైన ప్రక్రియలను విస్మరించి మున్సిపాలిటీల్లో విలీనం చేశారని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇప్పటికే దీనిపై ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో మున్సిపాలిటీలలో గ్రామాల విలీనం ప్రక్రియ సుప్రీంకోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటుందని చెబుతూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV