
న్యూఢిల్లీ , 15 అక్టోబర్ (హి.స.)
బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది శ్రేయస్సే ధ్యేయంగా సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆధునిక వసతులతో కూడిన ప్రత్యేక ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఢిల్లీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ నూతన ఆరోగ్య కేంద్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులతో కలిసి పనిచేసే సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరి వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ హెల్త్ సెంటర్ను తీర్చిదిద్దామని తెలిపారు.
మెరుగైన వైద్యం, నిపుణుల సలహాల కోసం ఢిల్లీలోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులైన మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్, రామ్ మనోహర్ లోహియా (RML) ఆసుపత్రులతో ఈ కేంద్రానికి నేరుగా కనెక్టివిటీ కల్పించినట్లు పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు