
న్యూఢిల్లీ, 15 అక్టోబర్ (హి.స.)
శాంతిని కోరుకోవడం భారతీయ నాగరికతలో భాగమని, అయితే శాంతిని కాపాడుకోవడానికి అవసరమైన శక్తి కూడా దేశానికి ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
టైమ్స్ నౌ డిఫెన్స్ కాంక్లేవ్ 2026 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో హైబ్రిడ్, హైటెక్, హైపర్ వార్ఫేర్ వంటి కొత్త తరహా యుద్ధ పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్ అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని తెలిపారు.
ప్రస్తుతం ఉగ్రవాద ముప్పు కేవలం ఉగ్రవాద సంస్థలకే పరిమితం కావడం లేదని పేర్కొన్నారు. వైట్ కాలర్ ఉగ్రవాదం, ఒంటరిగా దాడులకు పాల్పడే వ్యక్తుల రూపంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని వివరించారు. ఇలాంటి ముప్పులను ముందుగానే గుర్తించడం భద్రతా సంస్థలకు కష్టతరంగా మారుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడి అప్రమత్తత, బాధ్యత దేశ భద్రతకు కీలక రక్షణ కవచంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు, తప్పుడు ప్రచారాన్ని గుర్తించడం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి అంశాలు సమాజ భద్రతలో ముఖ్యమని వివరించారు.
ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని, దేశ సార్వభౌమత్వం, భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు తగిన సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడి, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని దాని మూలాల నుంచి నిర్మూలించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు