లాభాల బాటలో స్టాక్ మార్కెట్
అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు ప్రధానంగా ఐటీ దిగ్గజ సంస్థల అద్భుత పనితీరుతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాల బాట పట్టాయి.
Stock market


ముంబై, 15 అక్టోబర్ (హి.స.)

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు ప్రధానంగా ఐటీ దిగ్గజ సంస్థల అద్భుత పనితీరుతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాల బాట పట్టాయి.

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1,100 పాయింట్లు ఎగిసి 73,883 మార్కును తాకగా.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 319 పాయింట్ల లాభంతో 22,940 పాయింట్ల వద్ద పటిష్టంగా ట్రేడవుతోంది. ఇటీవల మార్కెట్లలో నెలకొన్న ఒడిదుడుకులకు బ్రేక్ వేస్తూ సూచీలు ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో పెరగడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది.

బ్యాంకింగ్, ఆటో రంగాలు కూడా తోడవడంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచే మార్కెట్లలో బుల్ జోరు స్పష్టంగా కనిపించింది. ఐటీ రంగ అగ్రగామి సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (HCL) రెండో త్రైమాసికం (Q2) ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించి రాణించడం మార్కెట్లకు ప్రధాన చోదక శక్తిగా మారింది.

దీంతో ఇన్వెస్టర్లు ఐటీ రంగ షేర్ల కొనుగోళ్లపై తీవ్ర ఆసక్తి కనబరిచారు. టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ వంటి ప్రముఖ ఐటీ షేర్లు 3 శాతానికి పైగా లాభపడి మార్కెట్ల ర్యాలీకి నాయకత్వం వహించాయి.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande