జర్మనీ బోచుమ్ నగరంలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి
జర్మనీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బోచుమ్ నగరంలోని ఓ అపార్ట్మెంట్లో తెల్లవారుజామున చెలరేగిన మంటల్లో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
జర్మనీలోని బోచుమ్లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి


బోచుమ్, 15 అక్టోబర్ (హి.స.) జర్మనీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బోచుమ్ నగరంలోని ఓ అపార్ట్మెంట్లో తెల్లవారుజామున చెలరేగిన మంటల్లో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.

మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక యువకుడు ఉన్నారు.ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులకు దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాయి.

బోచుమ్ సిటీలోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, అప్పటికే అపార్ట్మెంట్లో చిక్కుకున్న కేరళ రాష్ట్రానికి చెందిన అంజలి షీలా జాయ్ (25), నోవా సాబు (27) సావిన్ జానీ (26) ఊపిరాడక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అపార్ట్మెంట్లో మంటలు ఉద్దేశపూర్వకంగా పెట్టినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. హత్య కేసు కోణంలో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి అదే భవనంలో నివసిస్తున్న రొమేనియాకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతడే భవనానికి నిప్పు పెట్టి ఉంటాడనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు, నిందితుడి పాత్రపై అధికారిక దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande