
విజయవాడ, 15 అక్టోబర్ (హి.స.) విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, ఐదో రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి ఈ రోజు (అక్టోబర్ 15, 2026) కనకదుర్గమ్మ వారు శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు
కాత్యాయుని కుమార్తె కాత్యాయని దేవీ (లలిత త్రిపుర సుందరి దేవీ) బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కుంకుమ రంగు చీరను ధరించి నాలుగు భుజములతో సింహవాహనిగా దర్శనమిస్తుంది. చెరుకు గడ, పూలను చేతబూని అభయ, వరముద్రలతో అమ్మవారు భక్తులను కరుణిస్తుంది. ఈ రోజు అమ్మవారికి దద్దోజనం, క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.
ఈరోజు అమ్మకు సమర్పించే నైవేద్యం దద్దోజనం. అందులో పెరుగు, మిరియాలు, జీలకర్రను ఉపయోగిస్తారు. మిరియాలు ఉష్ణాన్ని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది.
ఘోరమైన దారిద్య్ర బాధల నుంచి ఉపశమనాన్ని కలిగించి మహదైశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి శ్రీలలితాదేవి. ఆమెవిద్యా స్వరూపిణి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి అనీ, మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందనీ విశ్వాసం. అమ్మవారు ‘అరుణ’ (బాలసూర్యుని) వర్ణంలో ప్రకాశిస్తూ చతుర్భుజాలతో- పాశము, అంకుశము, పుష్పబాణాలు, ధనుస్సు ధరించి, అణిమాది సిద్ధులు కిరణరూపంగా చుట్టూ ప్రకాశిస్తుండగా అపార కరుణా దృష్టితో దర్శనమిస్తుంది. ఆమె సకల దేవీ శక్తులకు మూల స్వరూపం. కాబట్టి ఏ అమ్మవారిని కొలిచినా లలితా సహస్ర నామంతో పూజిస్తారు. లలితాదేవి దర్శనం, సేవల వల్ల ఆయురారోగ్యాలు, సకాలంలో వివాహం, సౌభాగ్యం, వంశాభివృద్ధి, అభీష్ట సిద్ధి, ముక్తి కలుగుతాయని భక్తుల నమ్మిక. త్రిమూర్తులు, సకల దేవతలు ఆమెను కొలుస్తారనీ, ఆమెను ఆరాధించిన వారికి ఎల్లప్పుడూ సుఖ సౌఖ్యాలు కలుగుతాయనీ పురాణాలు చెబుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV