
హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.)
ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో హుందాయ్ ప్రతినిధులు భేటీ అయ్యారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లో రూ.8,528 కోట్లతో అంతర్జాతీయ స్థాయి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సుమారు 4,276 ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్రెడ్డితో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యో చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా జహీరాబాద్లో ఏర్పాటు చేయనున్న పరిశోధన, అభివృద్ధి కేంద్రానికి సంబంధించిన పెట్టుబడి ప్రణాళికలు, ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు