
న్యూఢిల్లీ, 16 అక్టోబర్ (హి.స.)
ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ (Starlink)తో సహా ఏ సంస్థ నుంచైనా పోటీని తాము పూర్తిగా స్వాగతిస్తామని రిలయన్స్ స్పష్టం చేసింది. బిలియనీర్ ఎలాన్ మస్క్, భారత టెలికాం రంగం మధ్య శాటిలైట్ స్పెక్ట్రమ్ నిబంధనలపై వివాదం చెలరేగుతున్న వేళ రిలయన్స్ చేసిన ఈ ప్రకటన కీలకంగా మారింది. అయితే, విదేశీ సంస్థలైనా, స్వదేశీ సంస్థలైనా భారత్లో వ్యాపారం చేయాలంటే ప్రతి ఒక్కరూ దేశ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా రిలయన్స్ పేర్కొన్నది. ఇటీవల మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు, రిలయన్స్పై వస్తున్న విమర్శల నేపథ్యంలో రిలయన్స్ అధికారికంగా స్పందించింది.
తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని, పోటీ అనేది కస్టమర్లకు ఎవరు ఉత్తమ సేవలు అందిస్తున్నారో నిరూపించే అత్యుత్తమ వేదికగా భావిస్తామని తెలిపింది. 2016లో ఎలాంటి కస్టమర్లు లేకుండా సరికొత్తగా భారత్ టెలికాం మార్కెట్లోకి ప్రవేశించిన జియో, కేవలం పదేళ్లలోపే 53 కోట్ల మందికి పైగా వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొందని తెలిపారు. భారత ప్రభుత్వం.. స్థానిక, విదేశీ దరఖాస్తుదారులందరికీ ఒకే విధమైన ప్రక్రియను అనుసరిస్తోందని రిలయన్స్ పేర్కొన్నది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..