
శ్రీ సత్యసాయి జిల్లా , 16 అక్టోబర్ (హి.స.)
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పరిధిలోని గొల్లపల్లి రిజర్వాయర్లో జరిగిన ఘోర జలవిషాదంపై పూర్తి స్పష్టత వచ్చింది. ప్రమాదం జరిగిన తొలి గంటల్లో మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా ప్రాథమిక సమాచారం వచ్చినప్పటికీ, పోలీసుల అధికారిక విచారణలో అసలు వివరాలు వెల్లడయ్యాయి. జలాశయంలో మునిగి మృతి చెందిన ఐదుగురిలో ఇద్దరు మాత్రమే ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కుమార్తె కాగా, మిగిలిన ముగ్గురు వారి పక్కింటి వారు మరియు అత్యంత సన్నిహిత స్నేహితులు. దసరా పండగ సెలవుల్లో సరదాగా గడుపుదామని వెళ్లిన విహారయాత్ర కాస్తా ఆ రెండు కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది.
పెనుకొండ పట్టణంలోని దర్గాపేటకు చెందిన స్థానిక డ్రైవర్ అజ్మతుల్లా తన కుటుంబ సభ్యులతో పాటు, పక్కింటి వారిని కూడా కలుపుకుని ఒకే బృందంగా గొల్లపల్లి రిజర్వాయర్ వద్దకు పిక్నిక్కు వెళ్లారు. మధ్యాహ్నం అందరూ కలిసి జలాశయం ఒడ్డున భోజనాలు ముగించుకున్న తర్వాత సరదాగా గడపడానికి ఐదుగురు మహిళలు నీటిలోకి దిగారు . అయితే వారికి రిజర్వాయర్ లోపల ఉన్న నీటి లోతుపై ఎలాంటి అవగాహన లేకపోవడంతో ప్రమాదవశాత్తు లోపలికి వెళ్లారు. అక్కడ అడుగున ఉన్న బురద కారణంగా వారు ఒక్కసారిగా నీటిలోకి లాగబడ్డారు. వీరిలో ఎవరికీ ఈత రాకపోవడంతో, నీటిలో మునిగిపోతున్న ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో ఐదుగురూ ఊపిరాడక అక్కడికక్కడే జలసమాధి అయ్యారు.
పోలీసు రికార్డుల ప్రకారం మరణించిన వారిలో దర్గాపేటకు చెందిన యాభై ఏళ్ల గాయత్రి, ఆమె కన్నకూతురు అశ్విని ఉన్నారు . మృతురాలైన అశ్వినికి ఇటీవలే వివాహం జరిగి బెంగళూరులో నివసిస్తోందని, దసరా పండగ సెలవుల కోసం పుట్టింటికి వచ్చిన సమయంలోనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీరితో పాటు నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన మిగిలిన ముగ్గురిని గాయత్రి కుటుంబానికి పక్కింటి వారు, అత్యంత సన్నిహిత స్నేహితులైన పుష్ప, హసీనా, మహీన్లుగా పోలీసులు గుర్తించారు. ఒడ్డున ఉన్న మిగిలిన కుటుంబ సభ్యులు ఆందోళనతో కేకలు వేయడంతో స్థానికులు స్పందించి అధికారులకు సమాచారం అందించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పెనుకొండ డీఎస్పీ శివప్రసాద్ తన పోలీస్ సిబ్బంది మరియు రెవెన్యూ అధికారులతో కలిసి తక్షణమే అక్కడికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి ఐదుగురు మహిళల మృతదేహాలను రిజర్వాయర్ నుండి బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . ఒకే వీధికి చెందిన ఐదుగురు మహిళలు మరణించడంతో పెనుకొండ దర్గాపేటలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్ర మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్