
హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, వివిధ రంగాలకు సంబంధించి పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల వినతిపత్రాలు అందజేశారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులకు తక్షణ ఆమోదం తెలపాలని కోరారు. కిషన్ రెడ్డిని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసిన తుమ్మల.. యాదాద్రి థర్మల్ ప్లాంట్ అవసరాల కోసం ముఖ్యమంత్రి కోరిన విధంగా మహానది నుంచి బొగ్గును కేటాయించాలని కోరారు. తెలంగాణ రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం కోల్ ఇండియా తరఫున రూ. 100 కోట్ల సీఎస్ఆర్ (CSR) నిధులను మంజూరు చేయాలని కోరారు. సత్తుపల్లి బ్లాక్-III బొగ్గు బ్లాక్ను సింగరేణి కాలరీస్ కంపెనీకి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు