
విజయవాడ, 16 అక్టోబర్ (హి.స.)విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో సాగుతున్నాయి.
శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధనకు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే మూలా నక్షత్రం వచ్చిందంటే చాలు.. చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవి దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారుల తల్లిదండ్రులు ఈ రోజుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. తమ పిల్లలు చదువులో రాణించాలని, మంచి జ్ఞానం సంపాదించాలని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తారు.
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి, శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం పర్వదినం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లని వస్త్రధారణలో, జ్ఞానప్రదాయిని సరస్వతీ దేవి స్వరూపంలో దర్శనమిస్తున్న జగన్మాతను చూసి భక్తులు పరవశించిపోతున్నారు.మూలా నక్షత్రం వేళ అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో అర్ధరాత్రి 12 గంటలకే దుర్గమ్మ దర్శనాలను అధికారులు ప్రారంభించారు. ఆలయ ఈఓ, ఛైర్మన్, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు తొలి దర్శనం చేసుకుని, ఉత్సవాల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
మూలా నక్షత్రం రోజున భక్తుల రద్దీ అత్యధికంగా ఉండటంతో అధికారులతో కలిసి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంద్రకీలాద్రిపై అన్ని రకాల వీవీఐపీ, సిఫార్సు, ప్రోటోకాల్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు.ఇవాళ (శుక్రవారం) సాయంత్రం అమ్మవారికి పట్టువస్త్రాలను సీఎం చంద్రబాబు సమర్పించనున్నారు. గత అనుభవాల నేపథ్యంలో మూడు హోల్డింగ్ పాయింట్లను పోలీసులు ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV