
తిరుమల, 16 అక్టోబర్ (హి.స.)
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహనసేవ ఈ రోజు శుక్రవారం తిరుమలలో జరగనుంది. ఇందుకు లక్షలాది మంది భక్తులు తిరుపతి మీదుగా తిరుమలకు చేరుకునే అవకాశం ఉన్నందున భక్తుల రాకపోకలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా ట్రాఫిక్ నియంత్రణకు కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్సీ సుబ్బరాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత ముఖ్యమైన గరుడ వాహన సేవ ఈ రోజు అక్టోబర్ 16వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు అట్టాహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు తిరుమల కొండపైకి భారీగా చేరుకోనున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని భద్రత, రద్దీ దృష్ట్యా బైక్ల రాకపోకలను బ్యాన్ చేశారు.
తిరుమల కొండపైకి రెండు రోజుల పాటు ఎలాంటి టూ వీలర్లను అనుమతించకూడదని నిర్ణయించారు. తిరుమలలో ప్రస్తుతం అత్యంత వైభవంగా జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు, దసరా పండుగ సెలవుల కారణంగా భక్తుల రద్దీ ఊహించని రీతిలో పెరిగింది. ఈ నేపథ్యంలో భద్రతను పర్యవేక్షించడం, వాహనాల రాకపోకలను నియంత్రించడంలో భాగంగా టీటీడీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు పండుగ సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. రద్దీ ఎక్కువ కావడం వల్ల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది.
దీంతో గరుడ సేవలకు హాజరయ్యే భక్తులు తమ వాహనాలకు బదులు ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకోవాలని టీటీడీ సూచిస్తోంది. వాహనాలను తిరుపతిలోని పార్కింగ్ ఏరియాల్లో ఉంచుకోవాలని చెబుతున్నారు. అయితే తిరుమల కొండపైకి బైక్లను నిషేధించడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ బ్రహ్మోత్సవాలు, రద్దీ సమాయాల్లో టీటీడీ ఇదే పని చేసింది. ఇప్పుడు రద్దీ కారణంగా మళ్లీ అదే నిర్ణయం అమలు చేస్తోంది. భక్తులు తమకు సహకరించాలని, బైక్లపై రావాలనుకునేవారు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV