
ఉజ్జయిని, 17 అక్టోబర్ (హి.స.)
టీవీ సీరియల్ ‘దేవోం కేదేవ్ మహాదేవ్’లో భగవాన్ శివుడి పాత్ర పోషించి ఇంటింటికీ పరిచయమైన ప్రముఖ నటుడు మోహిత్ రైనా శనివారం శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. ఆయనతో పాటు సతీమణి అదితి కూడా ఉన్నారు. ఇక్కడ వీరిద్దరూ భస్మ ఆర్తిలో పాల్గొని మహాకాల్ దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకున్నారు.
మోహిత్ రైనా, ఆయన భార్య శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్నారు. నంది హాల్లో కూర్చుని దాదాపు రెండు గంటల పాటు భస్మ ఆర్తిని తిలకించారు. ఈ సందర్భంగా వారు చేతులు జోడించి మహాకాల్‌ను భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. ఆర్తి సమయంలో భక్తుల నడుమ ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భస్మ ఆర్తి ముగిసిన తర్వాత మోహిత్ రైనా, అదితి ఆలయ ముఖద్వారం నుండి మహాకాల్‌ను నమస్కరించుకున్నారు. అనంతరం పూజారుల ద్వారా జలాభిషేకం చేసి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా పండిట్ ఆశిష్ పూజారి వీరిని సత్కరించారు.
భగవాన్ మహాకాల్ దర్శనం అనంతరం మోహిత్ రైనా తన అనుభవాలను పంచుకుంటూ.. “నాకు మాట్లాడటానికి మాటలు రావడం లేదు. బాబా దర్శనం అద్భుతమైన అనుభూతినిచ్చింది. దర్శనం చాలా బాగా జరిగింది. మహాకాల్ కృప అందరిపై ఉండాలి” అని అన్నారు. టీవీ సీరియల్ ‘దేవోం కే దేవ్ మహాదేవ్’లో శివుడి పాత్ర మోహిత్ రైనాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా ఆయన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రంలోనూ నటించారు. ఇవే కాకుండా ‘ది ఫ్రీలాన్సర్’, ‘ముంబై డెయిరీస్’, ‘భౌకాల్’, ‘కాఫిర్’ వంటి వెబ్ సిరీస్‌లతో పాటు ZEE5 జనాదరణ పొందిన ‘రంగబాజ్’ నాలుగో సీజన్లోనూ ఆయన కనిపించారు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు భస్మ ఆర్తి కొరకు తలుపులు తెరిచారు. ఆశ్విన శుక్ల సప్తమి సందర్భంగా నిర్వహించిన ఈ ఆర్తిలో మహాకాల్‌కు ప్రత్యేక అలంకరణ చేశారు. తలుపులు తెరిచిన తర్వాత పూజారులు, పండితులు గర్భగుడిలో కొలువుదీరిన దేవీ-దేవతలకు పూజలు నిర్వహించారు. భగవాన్ మహాకాల్‌కు జలాభిషేకం చేసిన అనంతరం పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పండ్ల రసాలతో కూడిన పంచామృతంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత హరిఓమ్ జలం సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు.
మహాకాల్‌కు వెండి ఓం, బిల్వపత్రాలతో చేసిన కిరీటం, రుద్రాక్ష మాల, సుగంధ భరిత పుష్పాలను సమర్పించారు. భగవానుడికి త్రిపుండ్రం, త్రిశూలంతో అలంకరణ చేశారు. దీనితో పాటు వెండి కిరీటం, ముండమాలతో సహా ఇతర ఆభరణాలతో శృంగరించారు. పూజా సమయంలో గణేశుడు, మాత పార్వతి, కార్తికేయులకు కూడా పూజలు నిర్వహించారు. మహాకాల్‌కు పండ్లు, మిఠాయిలను నైవేద్యంగా సమర్పించారు.
పూజ మరియు కర్పూర ఆర్తి అనంతరం భగవాన్ మహాకాల్‌కు భస్మ సమర్పణ జరిగింది. ఈ భస్మాన్ని మహానిర్వాణి అఖాడా తరపున సమర్పించారు. ధ్రామిక నమ్మకం ప్రకారం, భస్మ సమర్పణ తర్వాత మహాకాల్ నిరాకార రూపం నుండి సాకార రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. భస్మ ఆర్తిలో పాలుపంచుకున్న భక్తులు మహాకాల్‌ను దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. పలువురు భక్తులు నంది మహారాజ్ దర్శనం చేసుకుని వారి చెవిలో తమ కోరికలను విన్నవిస్తూ కనిపించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం బాబా మహాకాల్ జయనాగాలతో మార్మోగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi