
హైదరాబాద్ , 18 అక్టోబర్ (హి.స.)సూర్యాపేట జిల్లాలో జరిగిన ఒక దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా కరివిరాల కొత్తగూడెం టోల్గేట్ పరిధిలో సందీప్ అనే యువకుడు తన స్వగృహంలోనే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు.
రాత్రి సమయంలో ఎవరో దుండగులు ఇంటిలోకి ప్రవేశించి సందీప్పై దాడి చేసి హతమార్చి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సూర్యాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు గల కారణాలు వ్యక్తిగత కక్షలా లేక ఇతర ఆర్థిక లావాదేవీలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితులు ఎవరనేది త్వరలోనే తేలుస్తామని పోలీసులు తెలిపారు. పండుగ సమయంలో జరిగిన ఈ హత్య ఘటనతో మృతుని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్