
రాంపూర, 19 అక్టోబర్ (హి.స.)
ముస్లిం యువతీ యువకులకు ఇతర వర్గాలవారితో సమానంగా అపారమైన సామర్థ్యం, ప్రతిభ ఉందని, అయితే ప్రధాన రాజకీయ పార్టీలు వారిని కేవలం ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నాయే తప్ప సరైన వేదిక కల్పించడం లేదని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ముస్లింలు ఎవరికీ బానిసలు కాదని, సంప్రదాయ పార్టీల వెనుక నడవాల్సిన అవసరం లేదని ఓవైసీ స్పష్టం చేశారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్లోని రాంపూర లో ఆయన మాట్లాడుతూ.. తమకు నెహ్రూ, గాంధీ, యాదవ్ కుటుంబాల నాయకత్వం ఇకపై అవసరం లేదని, తమ సమాజం నుంచి స్వయంగా నాయకులు ఎదుగుతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకెన్నాళ్లు ఇతర పార్టీల నాయకుల వెనుక తిరుగుతూ, వారిని నెహ్రూలు, గాంధీలుగా భావించి మద్దతు ఇవ్వాలని కొందరు మనవారే చెబుతున్నారని కామెంట్ చేశారు. 'అలాంటి వారికి, ఒవైసీకి తేడా ఇదే; వాళ్లు ఇతరులను సమర్థించమంటారు, కానీ నేను మాత్రం మీరే నాయకులు కండి అంటాను' అని అసదుద్దీన్ ఒవైసీ తేల్చిచెప్పారు. చేశారు. దేశంలో అణగారిన వర్గాల గొంతు వినిపించేందుకు, ముస్లిం యువతకు రాజకీయ వేదికను అందించేందుకే తమ పార్టీ నిరంతరం పనిచేస్తూనే ఉందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..