
హైదరాబాద్, 02 అక్టోబర్ (హి.స.) ఇటీవల ఫ్లై దుబాయ్ విమానంలో కో-పైలట్ జరిపిన ప్రాణాంతక దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ తో ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం దుబాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ ఆరోగ్య పరిస్థితిని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలోనూ ఏమాత్రం సంయమనం కోల్పోకుండా చూపిన అసాధారణ ధైర్యసాహసాలను ప్రధాని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. ఆయన త్వరగా, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఈ సందర్భంగా పీఎం మోడీ ఆకాంక్షించారు. దేశం మొత్తం ఆయన సాహసాన్ని చూసి గర్విస్తోందని భరోసా ఇచ్చారు.
ఈ సంభాషణ సందర్భంగా గగనతలంలో కాక్పిట్ లోపల చోటుచేసుకున్న భయానక పరిణామాలు, ఆ సంక్షోభ సమయంలో తన అనుభవాలను కెప్టెన్ స్మిత్ ప్రధానితో పంచుకున్నారు. చావు అంచుల వరకు వెళ్లినప్పటికీ వందలాది మంది అమాయక ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోరాడటానికి తనకు మానసికంగా లభించిన స్థైర్యం, ధైర్యం గురించి వివరించినట్లు సమాచారం. దేశ ప్రజలందరి ప్రార్థనలు, ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కెప్టెన్ స్మిత్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..