రాయలసీమను ఫ్రూట్ బౌల్గా తీర్చిదిద్దుతాం: చంద్రబాబు
రాయలసీమ దశ, దిశ మార్చేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ తీసుకొచ్చామని ఏపీ.ముఖ్యమంత్రి చంద్రబాబు
చంద్రబాబు


మదనపల్లె, 02 అక్టోబర్ (హి.స.)పేదలకు న్యాయం చేయాలనే బాధ్యతతో పనిచేస్తున్నామని మరియు రాయలసీమ దశ, దిశ మార్చేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ తీసుకొచ్చామని ఏపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. కరవు నేలగా ఉన్న సీమ' ప్రాంతాన్ని ఫ్రూట్ బౌల్గా తీర్చిదిద్దుతామని చెప్పారు.

మదనపల్లెలో గ్లోబల్ హర్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరువు సీమలో గొప్ప కార్యక్రమం చేపట్టామని, రూ. లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ తయారుచేస్తామని చెప్పారు. కరువు సీమ.. సిరుల సీమ అవుతుందన్నారు. 2026, అక్టోబర్ 2.. సీమ చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.

అన్నదాతకు ప్రయోజనం చేకూర్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చిందని తెలిపారు. కరువు నేలను గ్లోబల్ ఫ్రూట్ బౌల్గా తీర్చిదిద్దుతామని, 6 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలను విస్తరిస్తామని చెప్పారు. ప్రకృతి సేద్యంలో ఏపీ మొదటిస్థానంలో ఉందని, పండ్లు, కూరగాయాలు, పూలు పండించే ప్రాంతం రాయలసీమ మాత్రమేనని చెప్పారు.

రూ.35వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తిచేసి మూడేళ్లలో జాతికి అంకితం చేస్తామని అన్నారు. చాలా మంది తనను వాటర్ మ్యాన్ అని అంటున్నారని, తప్పకుండా రాయలసీమను కరువు సీమ కాదు అని నిరూపిస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కుకు కేంద్రం నిధులు ఇచ్చి ఆదుకుందన్నారు. కేంద్రం సహకారంతో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏను నమ్మి ప్రజలు విజయాన్ని అందించారని, అనునిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈరోజు నుండి రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనంత్ అంబానీ మనందరికీ ముద్దుబిడ్డ అని, ఆంధ్రాబిడ్డ అని వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande