
తిరుపతి, 02 అక్టోబర్ (హి.స.) తిరుపతి జిల్లా వర్ధయ్యపాళెం మండలం బత్తలవల్లం 'ఏకం క్షేత్రం'లో కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలోని ఏకం ఆలయ వ్యవస్థాపకుడైన కల్కి భగవాన్ అలియాస్ విజయకుమార్ నాయుడి మృతి వార్త తెలిసి ఆయన భక్తులు ఏకం క్షేత్రానికి భారీగా చేరుకుంటున్నారు. మంగళవారం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కల్కి భగవాన్ పార్ధివదేహాన్ని భక్తుల సందర్శనార్థం ఏకం క్షేత్రంలో ఉంచిన విషయం తెలిసిందే.
ఈ ఘట్టాన్ని అధికారిక లాంఛనాలతో ఈ రోజు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వం నిర్వహించనుంది. కల్కి భగవాన్ చివరి చూపు కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు క్షేత్ర నిర్వాహకులు స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత భక్తుల క్యూ లైన్లను నిలిపివేసి, సాయంత్రం 4 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, శాస్త్రోక్తమైన ఆధ్యాత్మిక క్రతువులతో మహాసమాధి ఘట్టాన్ని పూర్తి చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV