'రాయలసీమ రైజింగ్' ...సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలోనేడు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నిర్మల
'రాయలసీమ రైజింగ్'తో సీమ సస్యశ్యామలం
'రాయలసీమ రైజింగ్'తో సీమ సస్యశ్యామలం


మదనపల్లె, 02 అక్టోబర్ (హి.స.)రాయలసీమ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చి, ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.లక్ష కోట్ల భారీ ప్రణాళికతో ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - రాయలసీమ రైజింగ్’ బృహత్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది.

సీమ రైతులు తరచూ ఎదుర్కొనే కరువు, సాగు నీరు, మార్కెటింగ్ సమస్యలకు పరిష్కారంగా సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక(ఐహెచ్డీపీ)కు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రూపకల్పన జరిగింది.

అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా ఈ రోజు శుక్రవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల సమక్షంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మెగా ప్రాజెక్టుకు లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు.

దీనికి సంబంధించిన వివరాలను మంత్రి అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటనలో వివరించారు.

‘కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ నిధులతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధమయింది. ఐహెచ్డీపీ కోసం రూ.లక్ష కోట్లు వెచ్చించబోతున్నాం.

10 జిల్లాలు... అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, తిరుపతి, కడప, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని 303 మండలాలు, 5869 గ్రామాల్లో 201 క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. మొత్తం 14.41 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలను విస్తరిస్తాం. అంతిమంగా 9.6 లక్షల మంది రైతుల ఆదాయం, జీవన ప్రమాణాల పెంపే మా లక్ష్యం. ఉద్యానవన పంటల విస్తరణకు అనువైన మౌలిక సదుపాయాలు... సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. ఐహెచ్డీపీతో సీమ ముఖచిత్రమే మారిపోతుంది.

ఇందుకోసం ప్రభుత్వ రంగంలో రూ.40,352 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాం. ప్రైవేట్ రంగంలో మరో రూ.60 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించనున్నాం. ఇందులో సాగునీటి రంగానికి రూ.20,884 కోట్లు, ఉద్యాన రంగానికి రూ.14,906 కోట్లు, గ్రామీణ రహదారులకు రూ.4,562 కోట్లు ఖర్చు చేయనున్నాం. 2026 ఆగస్టు నుంచి 2029 జూలై వరకు మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం’ అని మంత్రి అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటనలో వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande