పర్యావరణ హితంగా దీపావళి వేడుకలు: అక్టోబర్ 20 నుంచి నవంబర్ 8 వరకు దేశవ్యాప్తంగా 'గ్రీన్ దీపావళి' క్యాంపెయిన్!
పర్యావరణ హితంగా దీపావళి వేడుకలు: అక్టోబర్ 20 నుంచి నవంబర్ 8 వరకు దేశవ్యాప్తంగా 'గ్రీన్ దీపావళి' క్యాంపెయిన్!
diwali


న్యూఢిల్లీ, 20 అక్టోబర్ (హి.స.)

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 'గ్రీన్ దీపావళి' ఉద్యమం ప్రారంభమైంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మద్దతుతో డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 8 వరకు ఈ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమం కొనసాగనుంది.

బాణాసంచా కాల్చడం వల్ల వెలువడే హానికర కాలుష్యాన్ని తగ్గించి, పరిశుభ్రమైన పర్యావరణంలో దీపావళిని జరుపుకోవాలని పౌరులకు ఈ క్యాంపెయిన్ ద్వారా పిలుపునిచ్చారు. 'మిషన్ లైఫ్' నినాదానికి అనుగుణంగా ఈ వేడుకలను నిర్వహించాలని సూచించారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్థానిక సంఘాలను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయనున్నారు. ముఖ్యంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ పరిధిలోని 130 నగరాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

ఈ క్యాంపెయిన్‌లో భాగంగా పౌరులందరూ బాణాసంచా కాల్చకుండా ఉండాలని, తోటివారిని కూడా అలాగే ప్రోత్సహించాలని కోరుతూ 'గ్రీన్ దీపావళి ప్రతిజ్ఞ' చేయిస్తున్నారు. మట్టి ప్రమిదలు, శక్తిని ఆదా చేసే విద్యుత్ దీపాలు వాడటం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు దూరంగా ఉండటం, వ్యర్థాల విభజన, స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వంటి అలవాట్లను పెంపొందించడంపై అవగాహన కల్పిస్తారు.

దీంతో పాటు, పౌరులు తమ దైనందిన జీవనశైలి పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియా కార్బన్ ఫుట్‌ప్రింట్ సర్వేలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణ హితమైన ఈ వేడుకల్లో పాల్గొనే విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు తాము నిర్వహించిన కార్యకలాపాల వివరాలు, జియో-ట్యాగ్ చేసిన ఫోటోలను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలని నిర్వాహకులు కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande