
నాగ్‌పూర్, అక్టోబర్ 20(హి.స)
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నాగ్‌పూర్‌లో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో సంఘ్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశ నాగరికతా గుర్తింపు, సామాజిక సామరస్యం, సాంకేతికత సరైన వినియోగం మరియు దేశ భవిష్యత్తు ప్రణాళికలపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు.
చారిత్రక స్పూర్తి – ఆదర్శ పురుషుల స్మరణ:
దేశ స్వాతంత్ర్యం, సామాజిక చైతన్యం కోసం ప్రాణాలర్పించిన మహాపురుషుల ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా సంఘ్ శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మోహన్ భగవత్ తెలిపారు. సంతోషి శిరోమణి రవిదాస్ మహారాజ్, స్వామి శ్రద్ధానంద్, స్వామి లక్ష్మణానంద సరస్వతి, రాజ్ నారాయణ్ బసు వంటి మహనీయుల త్యాగాలను, సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. దేశంలో వైవిధ్యం సహజమని, అయితే భారతీయ రాజ్యాంగం మనందరినీ 'భారత ప్రజలుగా' ఒకే తాటిపై బంధించిందని పేర్కొన్నారు.
భారీ ప్రజా సంపర్క అభియాన్:
సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల నివేదికను ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా 4,61,527 గ్రామాలు, 41,076 పట్టణ బస్తీలలోని 10,19,88,511 ఇళ్లను స్వయంసేవకులు సంప్రదించారు. అలాగే 1,117 జిల్లాల్లో ప్రబుద్ధ నాగరిక్ గోష్ఠులు, 5,036 ఖండాల్లో సద్భావనా సమావేశాలు, 34,187 మండలాల్లో హిందూ సమ్మేళనాలు నిర్వహించగా.. లక్షలాది మంది యువకులు యువ సమ్మేళనాల్లో భాగస్వాములయ్యారు. విదేశాల్లోనూ భారతీయ సనాతన సంస్కృతి, హిందూ సమాజం విశిష్టతపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.
సామాజిక పరివర్తన – పంచ పరివర్తనాలు:
సమాజంలో గుణాత్మక మార్పు కోసం సంఘ్ ప్రతిపాదించిన 'పంచ పరివర్తనాలు' (సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ-స్వబోధ్, పౌర శిక్షణ) అత్యంత కీలకమని భగవత్ స్పష్టం చేశారు. కేవలం ఒక సంవత్సరానికి పరిమితం కాకుండా, ఇవి ప్రతి ఒక్కరి జీవిత విధానంగా మారాలని పిలుపునిచ్చారు.
సోషల్ మీడియా ప్రభావం – యువతలో వ్యసనాలు:
ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా వినియోగంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేడు యువత ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ కోల్పోయి సోషల్ మీడియాకు బానిసవుతున్నారని పేర్కొన్నారు. విచక్షణ లేకపోవడం వల్లే యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్ బారిన పడుతున్నారని, ఇది దేశాన్ని వేధిస్తున్న తీవ్రమైన జాతీయ సమస్య అని హెచ్చరించారు. ప్రభుత్వాలు, యంత్రాంగం, సమాజం కలిసికట్టుగా దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కూడా తగిన నిబంధనలు ఉండాలని సూచించారు.
భారత్ విశ్వగురు ప్రయాణం:
సైన్స్, టెక్నాలజీని మనం స్వాగతించాలని, అయితే టెక్నాలజీ అనేది కేవలం ఒక సాధనం మాత్రమేనని భగవత్ గుర్తుచేశారు. సమతుల్యమైన అభివృద్ధి కోసం నైతిక విలువలు, మానవీయ దృక్పథం ఎంతో అవసరమన్నారు. భారతీయ సనాతన దృష్టితోనే ప్రపంచానికి శాంతి, సుస్థిరత లభిస్తాయని చెప్పారు. గత చరిత్రలోని చేదు అనుభవాలను పక్కనబెట్టి, 'వందేమాతరం' స్ఫూర్తితో దేశమంతా ఒక్కటిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరి సమష్టి కృషితో భారత్ త్వరలోనే ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచి, విశ్వగురు స్థానాన్ని అధిరోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi