
నాగ్ పూర్, 20 అక్టోబర్ (హి.స.)
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది నవ శకంలోకి అడుగుపెడుతున్న శుభవేళ, నాగ్‌పూర్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన విజయదశమి వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. ఈ వేడుకలకు 'దైనిక్ జాగరణ్' ఎడిటర్-ఇన్-చీఫ్ సంజయ్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సంఘ్ వంద సంవత్సరాల ప్రస్థానాన్ని, దేశీయ భావజాల పరిరక్షణలో దాని పాత్రను కొనియాడుతూ ఆయన చేసిన ఉత్తేజపూరిత ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ చారిత్రక వేడుకలో పాల్గొనడం తనకు దక్కిన గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నారు.
బానిసత్వ విముక్తి నుంచి ఆత్మగౌరవ ప్రయాణం
సభను ఉద్దేశించి సంజయ్ గుప్తా మాట్లాడుతూ.. శతాబ్దం క్రితం దేశం పరాధీనతలో ఉన్న సమయంలో, హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు మరియు దేశ స్వాతంత్ర్యం కోసం సంఘ్ అవతరించిందని తెలిపారు. కేవలం రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే సరిపోదని, బానిసత్వ మనస్తత్వం నుండి సమాజం ముక్తమైనప్పుడే అసలైన స్వేచ్ఛ సాధ్యమని సంఘ్ నమ్మింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా జాతీయ భావన, వ్యక్తిత్వ వికాసాన్ని తన ప్రధాన ధ్యేయంగా ముందుకు తీసుకెళ్లింది. అయితే, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో అధికారంలో ఉన్న రాజకీయ వర్గాలు తమ ఓటు బ్యాంక్, రాజకీయ లబ్ధి కోసం సంఘ్ ప్రాధాన్యతను గుర్తించలేకపోయాయి. అన్ని ప్రతికూలతలను తట్టుకుని సంఘ్ తన లక్ష్యం వైపు స్థిరంగా సాగింది అని గుప్తా వివరించారు.
రాజకీయ స్థిరత్వం – నైతిక పునాది
సంఘ్ భావజాలం, స్వయంసేవకుల కఠోర శ్రమ ఫలితంగానే దేశంలో జాతీయవాద రాజకీయాలకు బలమైన పునాది పడిందని ఆయన పేర్కొన్నారు. సంఘ్ ప్రేరణతో ఆవిర్భవించిన జన్‌సంఘ్, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన తీరును ఆయన గుర్తుచేశారు. ఈ ప్రయాణంలో నిలిచిన నేతలలో కనిపించే జాతీయతా భావం, భారతీయుల పట్ల ప్రేమ మరియు విలువలు ఆర్ఎస్ఎస్ ద్వారా అబ్బినవేనని కొనియాడారు. హిందూ సమాజం శతాబ్దాల విదేశీ పాలనను తట్టుకుని, నేడు ప్రపంచ వేదికపై తన విశిష్ట గుర్తింపును చాటుకుంటోందంటే ఆ శ్రేయస్సు నిస్సందేహంగా ఆర్ఎస్ఎస్కే దక్కుతుందన్నారు.
రాబోయే శతాబ్దానికి సరికొత్త ధ్యేయం
నూరేళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సంఘ్, రాబోయే వందేళ్లలో సమాజంలో సమూల మార్పుల కోసం కార్యాచరణ రూపొందిస్తోందని గుప్తా తెలిపారు. ఆర్థిక వృద్ధి ఎంత వేగంగా సాగుతున్నప్పటికీ, నైతికత, క్రమశిక్షణ, సామాజిక ఐక్యత లేకపోతే దేశం సంపూర్ణ ప్రగతి సాధించలేదని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో దేశ ప్రజలలో నైతిక ప్రవర్తనను, కర్తవ్య నిష్టను పెంపొందించడమే సంఘ్ ముందున్న ప్రధాన సవాల్ అని వ్యాఖ్యానించారు. నైతిక విలువలు కలిగిన పౌరుల ద్వారానే భారత్ మళ్లీ విశ్వగురు స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
మీడియా రంగానికి జాగరణ్ మార్గదర్శనం
ఈ సందర్భంగా 'దైనిక్ జాగరణ్' ఎడిటోరియల్ విధానాన్ని ప్రస్తావిస్తూ.. తమ పత్రిక సిద్ధాంతం కూడా సంఘ్ ఆశయాలకు అనుగుణంగానే సనాతన భారతీయ నాగరికతను, జాతీయ ప్రయోజనాలను కాపాడటానికే ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన వంటి ఏడు సామాజిక రంగ్ పరిరక్షణ వేదికలపై దైనిక్ జాగరణ్ నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించారు. భారతీయ సంస్కృతిని, నైతిక విలువలను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టేందుకు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కృషిని ఆయన ఆకాశానికెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi