డీఆర్ఐ భారీ ఆపరేషన్ – రూ. 5.84 కోట్ల గోల్డ్, కరెన్సీ సీజ్
అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు విజయవంతంగా రట్టు చేశారు.
GOVT CASHEW WORKERS BONUS


అమరావతి , 21 అక్టోబర్ (హి.స.)

తెలుగు రాష్ట్రాల్లో హవాలా, బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒక అంతర్జాతీయ ముఠా నెట్‌వర్క్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు చాకచక్యంగా బట్టబయలు చేశారు. విజయవాడ సరిహద్దు ప్రాంతంలో పక్కా వ్యూహంతో దాడులు నిర్వహించిన అధికారులు, భారీ ఎత్తున విదేశీ కరెన్సీతో పాటు బిస్కెట్ల రూపంలో ఉన్న అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ. 5.84 కోట్లు ఉంటుందని అంచనా.

రహస్య అరల్లో విదేశీ నగదు, బంగారం:

విశ్వసనీయ సమాచారం అందుకున్న డీఆర్ఐ బృందాలు విజయవాడ వెలుపల రహదారిపై నిఘా పెట్టాయి. ఆ సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక స్కార్పియో కారును ఆపి సోదాలు చేశారు. వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా, అందులో స్మగ్లింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఒక రహస్య అర బయటపడింది. ఆ అరలో దాచిన 60 వేల అమెరికన్ డాలర్లు, 21,500 యూరోల విలువైన విదేశీ కరెన్సీ నోట్లను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఇదే ముఠాకు చెందిన మరికొందరు నిందితులు బస్సులో హైదరాబాద్ వైపు వెళ్తున్నట్లు తెలుసుకున్న అధికారులు, టోల్ ప్లాజా వద్ద ఆ బస్సును నిలిపివేసి తనిఖీలు చేశారు. ముగ్గురు ప్రయాణికుల నడుము పట్టీలలో దాచిన 3.1 కిలోల స్వచ్ఛమైన విదేశీ గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

బంగ్లాదేశ్ సరిహద్దుల నుండి నెట్‌వర్క్:

ఈ కేసుకు సంబంధించి ఐదుగురు కీలక నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ ముఠా బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చేరి, అక్కడి నుండి రోడ్డు, రైలు మార్గాల ద్వారా హైదరాబాద్‌కు ఈ సొత్తును తరలిస్తున్నట్లు తేలింది. ఎలాంటి పన్నులు కట్టకుండా నకిలీ పత్రాలతో ఈ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో విజయవాడ, హైదరాబాద్‌లోని స్థానిక జ్యువెలరీ వ్యాపారులకు మరియు హవాలా ఏజెంట్లకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ జరుపుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande