ముగిసిన దసరా సెలవులు – పునఃప్రారంభం కానున్న పాఠశాలలు
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన సుదీర్ఘమైన దసరా పండుగ సెలవులు ముగింపు దశకు వచ్చాయి.
School


హైదరాబాద్ , 21 అక్టోబర్ (హి.స.)తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన సుదీర్ఘమైన దసరా పండుగ సెలవులు ముగింపు దశకు వచ్చాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 22తో ఈ వేకేషన్ అధికారికంగా పూర్తి కానుంది. దీంతో అక్టోబర్ 23 (శుక్రవారం) నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు మళ్లీ క్లాసులకు హాజరు కావాల్సి ఉంటుంది.

పండుగ కోసం సొంత ఊళ్లకు, నగరాల నుండి గ్రామాలకు వెళ్లిన కుటుంబాలు తిరిగి హైదరాబాద్ ప్రయాణమవుతున్నాయి. దీనివల్ల బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రిటర్న్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ముఖ్యంగా విజయవాడ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ రూట్లలో అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. రైల్వే శాఖ కూడా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ ప్రవేశ మార్గాలైన ఉప్పల్, ఎల్బీ నగర్, కూకట్పల్లి టోల్ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సెలవులు ముగియడంతో పాఠశాలల యాజమాన్యాలు కూడా విద్యాబోధనకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో బతుకమ్మ, దసరా సెలవుల వల్ల జరిగిన సిలబస్ లోటును భర్తీ చేసేందుకు వీలుగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande