ఆదిలాబాద్ లో సీసీఐ ట్యాంకులు, భవనాల కూల్చివేత – అడియాసలైన పునరుద్ధరణ ఆశలు
జిల్లా కేంద్రం శివారు ప్రాంతంలో దశాబ్దాల చరిత్ర కలిగిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను తిరిగి ప్రారంభిస్తారనే ఆశలపై యంత్రాంగం తీసుకున్న నిర్ణయం నీరుగారిపోయేలా చేసింది.
BUILDING


ఆదిలాబాద్ , 22 అక్టోబర్ (హి.స.)

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం శివారు ప్రాంతంలో దశాబ్దాల చరిత్ర కలిగిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను తిరిగి ప్రారంభిస్తారనే ఆశలపై యంత్రాంగం తీసుకున్న నిర్ణయం నీరుగారిపోయేలా చేసింది. గురువారం ఉదయం సీసీఐ ప్రాంగణంలో ఉన్న భారీ నిల్వ ట్యాంకులతో పాటు పరిపాలనా భవనాలను అధికారులు బుల్డోజర్లు, భారీ యంత్రాల సహాయంతో పూర్తిగా కూల్చివేశారు. ఒకప్పుడు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన ఈ పారిశ్రామిక కేంద్రం గుర్తులు ఒక్కసారిగా నేలమట్టం కావడంతో స్థానిక ప్రజలు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు.

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ కర్మాగారం వివిధ కారణాల వల్ల చాలా ఏళ్ల క్రితమే మూతపడింది. గతంలో జరిగిన అనేక ఎన్నికల ప్రచారాలలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ పరిశ్రమను తెరిపిస్తామని, యువతకు ఉపాధి కల్పిస్తామని గొప్ప హామీలు ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారాయి. పరిశ్రమను పునరుద్ధరించడం పక్కన పెట్టి, ఉన్న నిర్మాణాలను తొలగించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.

ప్రాంగణంలో ఉన్న విలువైన ఇనుప సామాగ్రి, భారీ లోహ పరికరాలు, కాంక్రీట్ నిర్మాణాలను తొలగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భవిష్యత్తులో ఇక్కడ మళ్లీ కొత్త పరిశ్రమ వచ్చే అవకాశం పూర్తిగా సన్నగిల్లిందని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లనే జిల్లాకు చెందిన ఒక చారిత్రక పారిశ్రామిక ఆస్తులు కళ్ల ముందే కరిగిపోతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామం జిల్లా వ్యాప్తంగా రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande