ఎల్నినో ప్రభావంపై రేపు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్న సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, రానున్న నెలల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై తలెత్తే సమస్యలను ముందుగానే అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది.
Telangana CM Revanth Reddy


తెలంగాణ , 22 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, రానున్న నెలల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై తలెత్తే సమస్యలను ముందుగానే అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అక్టోబర్ 23న హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రులు, ప్రజాప్రతినిధులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రం ఎదుర్కొనే అవకాశమున్న సవాళ్లను సమీక్షించి, వాటిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

వ్యవసాయం, నీటిపారుదల, తాగునీటి సరఫరా, విద్యుత్ అవసరాలు పరస్పరం సంబంధం ఉన్న అంశాలు కావడంతో అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. వర్షాలు తగ్గితే జలాశయాల్లోకి వచ్చే నీటి పరిమాణం తగ్గే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం సాగునీటి ప్రణాళికలతో పాటు పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి సరఫరాపైనా పడవచ్చు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగి నీటి అవసరాలు అధికమైతే విద్యుత్ వినియోగం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వర్షాభావ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించడం, అవసరమైన సహాయక చర్యలను సూచించడం కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం ప్రాంతాలవారీగా పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు అందించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande