దేవరగట్టు బన్నీ ఉత్సవంలో హింస.. ఒకరు మృతి, వంద మందికి పైగా గాయాలు
కర్నూలు జిల్లా దేవరగట్టులో నిర్వహించిన బన్నీ ఉత్సవం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు సందర్భంగా అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామస్తుల మధ్య కర్రల సమరం హింసాత్మకంగా మారింది.
Devaragattu


కర్నూలు , 22 అక్టోబర్ (హి.స.)కర్నూలు జిల్లా దేవరగట్టులో నిర్వహించిన బన్నీ ఉత్సవం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు సందర్భంగా అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామస్తుల మధ్య కర్రల సమరం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో వంద మందికి పైగా గాయపడగా, ఆలూరుకు చెందిన పోతురాజు (28) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

హోళగుంద మండలంలోని దేవరగట్టులో ప్రతి ఏడాది సంప్రదాయంగా నిర్వహించే ఈ ఉత్సవానికి వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈసారి కూడా ఉత్సవ మూర్తులను కొండపై నుంచి కిందకు తీసుకొస్తున్న సమయంలో నేరనికి, నేరనికి తండా, కొత్తపేట గ్రామస్తులకు ఎదురుగా ఆలూరు, అరికెర, ఎల్లార్తి తదితర గ్రామాలకు చెందిన వారు కర్రలతో తలపడ్డారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లు, దివిటీలతో పరస్పరం దాడులకు దిగడంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది.

ఉత్సవంలో పాల్గొన్న వారిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు వెయ్యి మంది పోలీసులను మోహరించినప్పటికీ ఘర్షణలను పూర్తిగా నియంత్రించలేకపోయారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం పోలీసులకు సవాలుగా మారింది.

యువకుడి మృతితో దేవరగట్టులో విషాదం నెలకొనగా, ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, గాయపడిన వారి పరిస్థితిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. సంప్రదాయ ఉత్సవం హింసకు దారితీయడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande