
నాగర్ కర్నూల్, 23 అక్టోబర్ (హి.స.)
ప్రభుత్వ వైద్య కేంద్రానికి వచ్చే రోగులకు అందిస్తున్న సేవల నాణ్యత, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే సమయాలు, మందుల నిల్వలు, వైద్య పరికరాల వినియోగం, ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంతా కేశవ్ పాటిల్ తనిఖీలు నిర్వహించారు.
జిల్లాలోని కొల్లాపూర్ మండల పరిధిలోని రామాపురం మాతా శిశు వైద్య కేంద్రాన్ని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య కేంద్రంలో కొనసాగుతున్న వైద్య సేవలు, గర్భిణులు, బాలింతలు, శిశువులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, చికిత్సా విధానాలపై సంబంధిత వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందుతున్నాయా అనే విషయాన్ని పరిశీలించారు. మాతా శిశు ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన వైద్య సేవల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా చూడాలని, వైద్య కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరికీ అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు