
హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.)
పారిశ్రామిక ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, కార్మికుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలనీ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
సిగాచి పరిశ్రమ ప్రమాదం మరవకముందే గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీతో ఇద్దరు కార్మికులు మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
శుక్రవారం గడిపోతారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులతో మాట్లాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి ఒక్కో కుటుంబానికి రూ.70 లక్షల పరిహారంతో పాటు అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలుపై నిరంతర తనిఖీలు నిర్వహించి, ప్రమాదాలకు కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు