
కామారెడ్డి, 24 అక్టోబర్ (హి.స.)
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.
నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు సాగు చేస్తూ, వర్షపు నీటిని ప్రతి చుక్కా ఒడిసిపట్టాలని తెలిపారు. ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో ఫామ్ పాండ్ నిర్మించుకొని వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా సాగునీటి సమస్యలను అధిగమించాలని కలెక్టర్ సూచించారు. ఫామ్ పాండ్లతో నీటి సంరక్షణతో పాటు భూగర్భ జలాల పెంపునకు అవకాశం ఉంటుందన్నారు. శనివారం భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రైతు భిక్షపతి తన రెండెకరాల భూమిలో చేపట్టిన ఫామ్ పాండ్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పెద్దమల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సందర్శించి, రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న శనగ విత్తనాలను పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు